: అంత సులభం కాదు.. స్విస్ బ్యాంకులు తలుపులు తెరిచి పెట్టుకొని ఉండవు: 'నల్లధనం' తేవడంపై వెంకయ్య
విశాఖపట్నంలో ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేతలు నిర్వహించిన పెద్దనోట్ల రద్దుపై అవగాహన కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... విదేశీ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల డబ్బు ఉందని, అక్కడి నుంచి డబ్బును ఆగమేఘాల మీద తీసుకురండని కొందరు ఉచిత సలహాలిస్తున్నారని, అయితే బ్యాంకుల నుంచి డబ్బు తీసుకురావడం అంత తేలికకాదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ విమానంలో స్విస్ బ్యాంకుకు వెళ్లి 'డబ్బు ఇచ్చేయండి' అనగానే వారు తల ఊపుతూ వెంటనే ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. బ్యాంకులు తలుపులు తెరిచి పెట్టుకొని ఉండబోవని ఎద్దేవా చేశారు. బ్యాంకుల్లో ఉంచిన ఖాతాదారుల డబ్బు వివరాలు గురించి ఏ మాత్రం చెప్పబోరని ఆయన అన్నారు. మన బ్యాకుంల్లో ఉన్న ఖాతాదారుల వివరాలు చెప్పమంటేనే మన బ్యాంకర్లు చెప్పబోరని, ఇక విదేశాల్లో ఉన్న వారు మనకు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. నల్లధనాన్ని రాబట్టడానికే స్విట్జర్లాండ్ ప్రభుత్వతో ఒప్పందం చేసుకున్నామని, అక్కడి నుంచి డబ్బు తెచ్చే ప్రక్రియ ఒక్కరోజులో అయిపోయేది కాదని అన్నారు. విదేశాల్లో, దేశంలో ఉన్న నల్లడబ్బంతా రాబడుతున్నామని చెప్పారు. విదేశాల్లో ఉండే నల్లధనాన్ని తీసుకురావడానికి ఒప్పందాలు చేసుకుంటున్నామని, మరి దేశంలో ఉండే నల్లధనం ఎలా బయటకు తీయాలని ప్రశ్నించారు. అందుకే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజల్లో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ పై కూడా అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో వెయ్యి, ఐదు వేలు పదవేల నోట్లు ఉండేవని, అప్పుడు కూడా ఆ నోట్లను రద్దు చేశారని... కానీ, అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని పెద్దనోట్ల రద్దుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. పెద్దనోట్లను రద్దు చేసేముందే ప్రధాని మోదీ నల్లధనం ఉన్న వ్యక్తులకు 90 రోజులు టైమ్ ఇచ్చారని, వారి వద్ద ఎంత డబ్బు ఉన్నా చూపించాలని, దానికి పన్ను కట్టాలని చెప్పారని వెంకయ్య నాయుడు అన్నారు. ‘పెద్దనోట్ల రద్దు అంశం ప్రకటించేముందు అన్ని ఏర్పాట్లు చేసుకొని కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఎవరినీ సెల్ పోన్లు లోపలికి తీసుకురానివ్వలేదు. తీసుకున్న నిర్ణయంపై, దేశ పరిస్థితిపై మోదీ వివరించారు. పాకిస్థాన్, మాఫియా, టెర్రరిస్టులు, మావోయిస్టులను నిర్మూలించేందుకు, సమాంతర ఆర్థిక వ్యవస్థపైన ఆధారపడుతున్న వారిని అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ టీవీలో చేసిన ప్రకటన పూర్తయ్యేవరకు మేము సమావేశ మందిరం నుంచి బయటకు రాలేదు. ఇంత పద్ధతిగా మోదీ అన్ని వ్యవహారాలను చేస్తే తొందరపాటు చర్య అని విమర్శిస్తున్నారు’ అని వెంకయ్య నాయుడు అన్నారు.