: మూడేళ్ల నుంచి జరుగుతున్న కుంభకోణం.. నోట్ల రద్దుతో బయటపడింది!


అంతా సాఫీగా జరుగుతోందని, నెలకు లక్షల్లో డబ్బు నొక్కేస్తున్నామని భావిస్తున్న వారి ఆనందం నోట్ల రద్దుతో పటాపంచలు కాగా, వారంతా ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. పాత నోట్ల రద్దు తరువాత, కొత్త నోట్లు మార్కెట్లోకి రాగా, ఏటీఎంలలో డబ్బులు పెట్టే వేళ తీసిన లెక్కలు విశాఖ బ్యాంకు అధికారులకు కొత్త అనుమానాలు వచ్చేట్టు చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసే వరకూ వెళ్లగా, కోట్ల విలువైన కరెన్సీని అక్రమంగా నొక్కేసిన ఇంటి దొంగల సరికొత్త దారి బయటపడింది. ఏటీఎం సెంటర్లలో డబ్బులు నింపే కస్టోడియన్లలో దాదాపు 10 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి అధిక మొత్తంలో కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించి వారు ఎలా డబ్బు నొక్కేస్తున్నారన్నది తెలిస్తే విస్తుపోక తప్పదు. నగదు నింపే పనిని మేనేజింగ్ సర్వీసస్ ప్రొవైడింగ్ సంస్థకు ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీలతో పాటు మరికొన్ని బ్యాంకులు అప్పగించగా, ఆ సంస్థ సైంటిఫిక్ సెక్యూరిటీ మేనేజ్ మెంట్ సర్వీస్ అనే వేరొక సంస్థకు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది. బ్యాంకులు ఇచ్చే ఇండెంట్ ల ఆధారంగా ఏటీఎంలలో నగదు పెట్టాల్సిన వీరు కొద్ది కొద్ది మొత్తాల్లో డబ్బు తక్కువ చేసి పెడుతూ, ఎవరికీ అనుమానం రాకుండా లక్షలు నొక్కేశారు. ఇలా గడచిన మూడేళ్లలో కోటి రూపాయలకు పైగా దోచారు. ఇక బ్యాంకు అధికారులు ఏ రూట్లో తనిఖీలు జరుపుతారో కూడా వీరికి ముందే తెలిసిపోతుండటంతో బ్యాంకు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెకింగ్ కు అధికారులు వస్తున్నారని తెలిస్తే, ముందుగానే ఇతర ఏటీఎంల నుంచి డబ్బు తెచ్చి చెకింగ్ జరిగే ఏటీఎంలలో వీరు డబ్బు నింపేవారని పోలీసులు గుర్తించారు. ఇక నొక్కేసిన డబ్బులో నిందితులు అత్యధిక భాగం జల్సాలకు, ఇంటి అవసరాలకు వాడుకున్నారని, రూ. 35 లక్షలను రికవరీ చేశామని పోలీసులు తెలిపారు. కొత్త నోట్లు వచ్చిన వేళ, దందా నుంచి బయటపడాలంటే, పాత నోట్లను సేకరించాలన్న ఉద్దేశంలో ఉన్న వీరు భారీగా పాత నోట్లను సేకరిస్తుంటే ఉప్పందుకున్న పోలీసులు కన్నేశారు. ఆపై రూ. 20 లక్షల కరెన్సీని మార్చేందుకు ఈ కస్టోడియన్ల ముఠా విజయవాడ వ్యక్తితో డీల్ ను కుదుర్చుకోగా, డబ్బు తీసుకు వస్తున్న అతను టికెట్ లేకుండా రైలెక్కి, పోలీసులకు చిక్కడంతో మొత్తం కథ వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News