: టాటా కొత్త చైర్మన్ ఎవరైనా అధికారాలు మాత్రం పరిమితమే!
టాటా సన్స్ చైర్మన్ గా సైరస్ మిస్త్రీని తొలగించిన తరువాత కొత్త చైర్మన్ ఎంపిక పనిలో తలమునకలై ఉన్న రతన్ టాటా బృందం, కొత్త చైర్మన్ బాధ్యతలు, అధికారాలపై కోత విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా, చైర్మన్ అధికారాన్ని పరిమితంగానే ఉంచాలని రతన్ టాటా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా విధించినట్టు సమాచారం. టాటా సన్స్ కు చైర్మన్ గా ఉన్న వ్యక్తి గ్రూప్ కంపెనీల్లోని బోర్డు డైరెక్టర్ల అధిపతిగా ఉండాల్సిన అవసరం లేదన్నది కొత్త మార్గదర్శకాల్లో ఒకటి. ఇక చైర్మన్ నిర్వర్తించే విధులను ఇద్దరు లేదా ముగ్గురికి పంచడం ద్వారా, కంపెనీలో 'అధికార కేంద్రం' అన్న మాట వినిపించకుండా చూడాలని కూడా టాటా సన్స్ పెద్దలు భావిస్తున్నారు. తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులనే కంపెనీలకు చైర్మన్లుగా నియమించడం ద్వారా జేఆర్డీ టాటా సంస్థను నడిపిన నాటి రోజులను మరోసారి గుర్తుకు తేవాలని రతన్ టాటా భావిస్తున్నట్టు టాటా సన్స్ వర్గాలు వెల్లడించాయి.