: విరాట్‌ కోహ్లీ బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్‌


టీమిండియా టెస్టు కెప్టెన్‌ నిబంధనల‌ను ఉల్లంఘిస్తూ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని బ్రిటీష్‌ పత్రిక ‘ది డైలీ మెయిల్‌’ ఇటీవ‌లే ఓ కథనాన్ని ప్రచురించిన విష‌యం తెలిసిందే. భార‌త్‌-ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య ఈ నెల‌ 9 నుంచి 13 వరకు రాజ్‌కోట్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచులో విరాట్ కోహ్లీ ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడ‌ని, వీడియో ఆధారాలు కూడా ఉన్నాయ‌ని ఆ ప‌త్రిక పేర్కొంది. ఈ క‌థ‌నంపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. ఓ జాతీయ వార్తా ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడుతూ... వారు చేస్తోన్న‌వి అర్థంలేని ఆరోపణలని, ఇటువంటి ఆరోప‌ణ‌లు చేయ‌కం కన్నా విశాటపట్నంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ జ‌ట్టు ప‌రాజ‌యం పాల‌వ‌డాన్ని గౌరవప్రదంగా అంగీకరించి ఉంటే ఆ దేశ క్రికెట్ జ‌ట్టు గౌర‌వం పెరిగేద‌ని పేర్కొన్నాడు. ప‌రాజ‌యం పొందే జట్టు ఎల్ల‌ప్పుడూ ప‌లు అంశాలను చూపిస్తూ సానుభూతి పొందాలని చూస్తుందని వ్యాఖ్యానించాడు. కోహ్లీ బాల్ ట్యాంప‌రింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌త్య‌ర్థి ఇంగ్లండ్‌ జట్టు ఎలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌లేద‌ని, బ్రిటీష్ మీడియా మాత్రం ఇలాంటి క‌థ‌నాలు ప్ర‌చురిస్తోంద‌ని సెహ్వాగ్ అన్నాడు. టీమిండియా విదేశాల్లో పరాజ‌యం పాల‌యిన‌ప్పుడు ఎటువంటి సాకులు చెప్ప‌లేద‌ని, ఇంగ్లండ్ ఓడిపోయిన విష‌యాన్ని గౌర‌వప్ర‌దంగా అంగీక‌రించాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించాడు. టీమిండియా విదేశాల్లో ఓడిపోతే సరిగా ఆడలేనందువల్లే ఓడిపోయామ‌ని గతంలో ఎంతో హుందాగా అంగీక‌రించిందని ఆయ‌న అన్నాడు.

  • Loading...

More Telugu News