: ఎర్రచందనం లేడీ డాన్ సంగీత ఎక్కడ? ఆర్నెల్లుగా ఆచూకీ లేని మాజీ ఎయిర్ హోస్టెస్
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఒక్కసారిగా తెరపైకి వచ్చి సంచలనం సృష్టించిన లేడీ డాన్, మోడల్, మాజీ ఎయిర్ హోస్టస్ సంగీత చటర్జీ ఇప్పుడు ఏమైంది? ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలు పోలీసు అధికారులను వేధిస్తున్నాయి. ఆర్నెల్ల క్రితం అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆమె అరెస్ట్ వ్యవహారం క్రమంగా మూలన పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. చిత్తూరు, కోల్‌కతా కోర్టులు ఆమె అరెస్ట్‌కు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసినా పోలీసులు ఆమెను వెతికి పట్టుకోవడంలో విఫలమవుతున్నారు. ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ అయిన లక్షణ్ రెండో భార్యనే సంగీత. పోలీసులకు ఆయన చిక్కిన తర్వాత లక్ష్మణ్ అక్రమ సామ్రాజ్యాన్ని సంగీత ముందుండి నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెపై పలు కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది మేలో ఆమెను కోల్‌కతాలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో ఆమె బ్యాంకు లాకర్ల నుంచి పలు విలువైన పత్రాలు, లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ కింద ఆమెను చిత్తూరు కోర్టులో హాజరు పర్చాల్సి ఉంది. ఈ క్రమంలో కేసుల నుంచి బయటపడడానికి సంగీత పలుమార్లు కోల్‌కతా కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా, ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఈ కేసులో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం మొదలుపెట్టారు. అరెస్ట్ వారెంట్లను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరోవైపు మదనపల్లె కోర్టులో ఉన్న లక్ష్మణ్ బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన కనుక జైలు నుంచి విడుదలై భార్య సంగీతను కలిస్తే అప్పుడు అరెస్ట్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంగీతను కనుక అరెస్ట్ చేస్తే మరికొందరు అంతర్జాతీయ స్మగ్లర్ల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.