: ఐటీ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి అయిన గాలి జనార్దన్‌రెడ్డి.. సమాధానం ఇవ్వలేక తడబాటు
ఐటీ అధికారుల ప్రశ్నలతో మాజీ మంత్రి, గనుల అక్రమ తవ్వకాల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన గాలి జనార్దన్‌రెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అధికారుల ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తడబాటుకు గురయ్యారు. కనీవినీ ఎరుగని రీతిలో కుమార్తె పెళ్లి చేసిన గాలి దేశం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. కాగా పెళ్లి వేడుకలు పూర్తిగా ముగియకముందే ఆయన కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం విదితమే. అధికారుల ప్రశ్నలతో గాలి జనార్దన్‌రెడ్డి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వారికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక తలపట్టుకున్నట్టు తెలిసింది. కుమార్తె వివాహానికి సంబంధించి ప్రతి పైసాకు లెక్క ఉందని మాత్రం ఆయన చెప్పినట్టు సమాచారం. ఆస్తులు కుదువపెట్టి డబ్బులు తెచ్చినట్టు చెప్పుకొచ్చిన గాలి.. ఐటీ అధికారులు సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయనకు ఐటీ అధికారులు సంధించిన ప్రశ్నల్లో కొన్ని.. బ్రాహ్మిణి పెళ్లికి ముందు, తర్వాత చేసిన ఖర్చుల వివరాలతోపాటు హాజరైన అతిథుల వివరాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోసం చేసిన ఖర్చుల వివరాలు కూడా సమర్పించాలని అధికారులు గాలిని కోరారు. అలాగే అతిథుల రవాణా, వసతి సౌకర్యాల కోసం చేసిన ఖర్చులు, బౌన్సర్లకు చెల్లించిన సొమ్ము వివరాలు, వినోద కార్యక్రమాలు చేసిన ఖర్చులు, బ్రాహ్మిణి ధరించిన నగలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎంత ఖర్చయింది? తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించారు. పెళ్లి ఖర్చుల నిమిత్తం చేసిన లావాదేవీలు, ఉపయోగించిన క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు కావాలని కోరారు. అలాగే అతిథులకు ఇచ్చిన కానుకల వివరాలు కూడా సమర్పించాలని అధికారులు గాలిని ఆదేశించినట్టు తెలుస్తోంది. వీటన్నింటికీ గాలి జనార్దన్‌రెడ్డి ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టాలని ఐటీ అధికారులు యోచిస్తున్నారు. కాగా, గాలి తన కుమార్తె పెళ్లికి దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేసినట్లు ఐటీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. వాటిపై కొన్ని ఆధారాలు కూడా సేకరించిన అధికారులు, గాలి సమర్పించే వివరాలతో వాటికి పొంతన కుదరకపోతే చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.