: కనిపించకుండా పోయిన రూ.3.5 కోట్లు దొరికాయి.. నాగాలాండ్ ఎంపీ అల్లుడి అరెస్ట్
కనిపించకుండా పోయిన రూ.3.5 కోట్లు తిరిగి చిక్కాయి. మంగళవారం నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో ఓ చార్టర్డ్ విమానం నుంచి స్వాధీనం చేసుకున్న రూ.3.5 కోట్ల విలువైన పాత రూ.500, రూ.1000 నోట్ల కట్టలు బుధవారం కనిపించకుండా పోవడంతో కలకలం రేగింది. అయితే సీఐఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేసిన రూ.3.5 కోట్లను ఇన్‌కం ట్యాక్స్ అధికారులకు అప్పగించారని నాగాలాండ్ పోలీస్ చీఫ్ ఎల్ ఎల్ డౌంగెల్ తెలిపారు. నాగాలాండ్ వ్యాపారవేత్త అనాటో ఝిమోమీ ఆ డబ్బులకు సంబంధించిన ఐటీ లెక్కలు చూపడంతో ఆ సొమ్మును తిరిగి ఇచ్చేసినట్టు ఆయన వివరించారు. ఆ డబ్బును ఆయన ఆర్జీటీఎస్ ద్వారా తన అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకున్నాడని అధికారులు గుర్తించారు. దీంతో మనీ లాండరింగ్ కేసు కింద ఝిమోమీని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగాలాండ్ నుంచి ఏకైక ఎంపీ అయిన నీఫియు రియో అల్లుడే ఝిమోమీ. నాగాలాండ్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి చార్టర్డ్ విమానంలో తరలిస్తున్న రద్దు అయిన నోట్లను సీఐఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనివెనక మనీలాండరింగ్ రాకెట్ ఉన్నట్టు గుర్తించిన అధికారులు ఝిమోమీని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనక పలువురు వ్యాపారవేత్తలు ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటి వరకు మూడుసార్లు అదే విమానంలో డబ్బులను తరలించినట్టు ఝిమోమీ అంగీకరించినట్టు ఐటీ అధికారులు తెలిపారు.