: బాలీవుడ్ నటికి 'నకిలీ' షాక్ ట్రీట్మెంట్!
బాలీవుడ్ నటికి సోషల్ మీడియాలో నెటిజన్ షాకిచ్చాడు. గత వారం ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం పెద్ద పార్టీ ఇచ్చారు. దీంతో ఆ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ నటి తారా శర్మ పార్టీ ముగిసిన అనంతరం ఇంటికి వచ్చి ధన్యవాదాలు తెలుపుతూ అభిషేక్ బచ్చన్ కు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ అభిషేక్ కు ట్యాగ్ చేయకుండా... అభిషేక్ పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ కు ట్యాగ్ చేసింది. ఈ ట్వీట్ లో ఆమె ఏమందంటే... 'చక్కటి పార్టీ ఇచ్చినందుకు జూనియర్ బచ్చన్, ఐష్ కు ధన్యవాదాలు. మనమంతా చాలా సరదాగా సమయాన్ని గడిపాం. అక్కడి నుంచి రావాలని అనిపించలేదు! లిటిల్ ప్రిన్సెస్ కి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు' అని పేర్కొంది. దీనికి ఆ ఫేక్ అకౌంట్ ఉన్న వ్యక్తి సమాధానమిస్తూ... 'థ్యాంక్స్ తారా! మనమిద్దరం చాలా విలువైన సమయాన్ని గడిపాం. ఈసారి దయచేసి తక్కువ తాగు.. దాంతో ఎవరిని ట్యాగ్ చేయాలో సరిగ్గా తెలుస్తుంది. నువ్వు ఇలా ట్వీట్ చేయడం ఇది రెండోసారి’ అన్నాడు. దీనిని చూసిన తారా శర్మ ఎలా ఫీలైందో తెలియదు కానీ... దీనిని చూసిన వారంతా ముందు ఆశ్చర్యపోయి, తరువాత నవ్వుకుంటున్నారు.