: ఆస్ట్రేలియా జట్టులో సమూల మార్పులు
పరాజయభారంతో సతమతమవుతున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు విజయాల బాటపట్టాలంటే ఇప్పుడున్న జట్టుతో సాధ్యం కాదని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో సమూల మార్పులు చేయాలని భావిస్తోంది. దీంతో మొత్తం జట్టును ప్రక్షాళన చేయనుంది. ఈ నెల 24 నుంచి అడిలైడ్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టుకు కొత్తరూపం తీసుకురానుంది. ఈ సందర్భంగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ, సిరీస్‌లోని మిగతా మ్యాచులను తప్పక గెలవాలనే పట్టుదలతో జట్టులోకి కొత్త వాళ్లను తీసుకుంటున్నామని అన్నాడు. ఇంతవరకు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడని కుర్రాడు రెన్ షా (19), జాక్సన్ బ్రిడ్, పీటర్ హెండ్స్ కోబ్ లు కొత్తగా జట్టులోకి రానున్నారని తెలిపాడు. గతంలో రెండు టెస్టులు ఆడిన అనుభవం కలిగిన నిక్ మాడిన్సన్ కు కూడా టెస్టు జట్టులో చోటు కల్పించినట్టు చెప్పాడు. సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ లను నెగ్గేందుకు చేయాల్సి అన్ని ప్రయత్నాలను చేస్తామని స్మిత్ తెలిపాడు. ఈ ప్రక్షాళనతో జట్టు పుంజుకుంటే భవిష్యత్ పై బెంగ తగ్గుతుందని స్మిత్ అభిప్రాయపడ్డాడు.