: పెద్దనోట్ల అంశంపై వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్.. లోక్‌సభ రేపటికి వాయిదా
పెద్దనోట్ల అంశంపై లోక్‌సభలో ఈ రోజు తీవ్ర గందరగోళం నెలకొంది. పెద్దనోట్ల అంశంపై వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. పెద్దనోట్ల రద్దుపై ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని విపక్ష నేతలు నినాదాలు చేశారు. విపక్షాల ఆందోళనల మధ్యే పలువురు సభ్యులు మాట్లాడారు. పెద్దనోట్లపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పినప్పటికీ విపక్ష నేతలు ఆందోళన కొనసాగించారు. అయితే, లోక్ సభలో చర్చకు తాము కూడా సిద్ధంగానే ఉన్నామని, కానీ, ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఉండి తమ అభిప్రాయాలు వినాలని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. విపక్ష నేతలు ఆందోళనను విడవకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్‌సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.