: 'ఐఏఎస్' ప్రేమాయణం.. సెకండ్ ర్యాంకర్ ను పెళ్లి చేసుకోనున్న 2015 ఐఏఎస్ టాపర్ టీనా!
అమీర్ ఉల్ షఫీ ఖాన్... 2015 ఐఏఎస్ రిజల్ట్స్ లో సెకండ్ టాపర్. నాడు తొలి స్థానంలో నిలిచింది టీనా దాబీ అనే 22 సంవత్సరాల యువతి. ఐఏఎస్ పరీక్షల్లో ఆమెను జయించలేకపోయిన షఫీ ఖాన్, నిజ జీవితంలో ఆమె మనసును కొల్లగొట్టాడు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో వీరిద్దరూ డేటింగ్ చేస్తున్న ఫోటోలు హల్ చల్ చేస్తుండగా, స్నేహితులు, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన మాత్రమే వస్తోంది. ప్రస్తుతం ముస్సోరీలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్ లో శిక్షణ పొందుతున్న టీనా దాబీ, తమ వివాహానికి తేదీని ఖరారు చేయలేదని, త్వరలోనే ఎంగేజ్ మెంట్ చేసుకుంటామని చెప్పారు. తామిద్దరమూ గత సంవత్సరం మే 11న ఐఏఎస్ ఉత్తీర్ణులకు జరిగిన సన్మాన సభలో తొలిసారి కలుసుకున్నామని, తనను తొలి చూపులోనే అమీర్ ప్రేమించినట్టు తరువాత తెలిసిందని టీనా మురిపెంగా చెబుతోంది. కాగా, వీరి ఫోటోలను చూసిన కొందరు, ఆమె తన విలువైన సమయాన్ని వృథా చేస్తోందని, జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో తప్పటడుగు వేసిందని అంటుండగా, మరికొందరు వీరి ప్రేమను ఆశీర్వదిస్తున్నారు.