: డబ్బు కోసం బ్యాంకు ‘క్యూ’లో తండ్రి... తీవ్ర జ్వరంతో కూతురు మృతి!


పెద్దనోట్ల మార్పిడి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. సహనం కోల్పోయిన ఖాతాదారులు బ్యాంకు అద్దాలు పగులగొట్టడం, వారిపై పోలీస్ లాఠీలు విరగడం నుంచి పని ఒత్తిడి తట్టుకోలేక దేశంలో ఏదో ఒక బ్యాంకులో సిబ్బంది మృతి చెందిన వార్తలు వింటూనే ఉన్నాము. చిన్ననోట్లను అందించడంలో బ్యాంకులు, ఏటీఎంలు విఫలమవడంతో కొన్ని చోట్ల పెళ్లిళ్లు కూడా ఆగిపోయాయి. కాగా, ఉత్తరప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగు చూసిన విషాద సంఘటన పలువురిని కలచివేస్తోంది. సరైన సమయానికి డబ్బు డ్రా చేసుకోలేకపోవడంతో తన నాలుగేళ్ల కూతురుని పోగొట్టుకున్నాడు ఒక కార్మికుడు. ఈ సంఘటన అలహాబాద్ లోని బాందా జిల్లాలో ఉన్న టిండువరి టౌన్ లో జరిగింది. కార్మికుడు ధర్మేంద్ర వర్మ కూతురు కొన్నిరోజులుగా జ్వరంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు డబ్బు అవసరమైంది. దీంతో, డబ్బు డ్రా చేసుకునేందుకు అలహాబాద్ యూపీ గ్రామీణ్ బ్యాంక్ కు గత కొన్ని రోజులుగా వెళుతున్నప్పటికీ పని కావడం లేదు. ఈ క్రమంలో నిన్న కూడా బ్యాంక్ కు వెళ్లాడు. బ్యాంక్ లో డబ్బులు తీసుకుని అటునుంచి అటే తన కూతురుని ఆసుపత్రికి తీసుకువెళ్లాలని భావించాడు. తనతో పాటు కూతురుని కూడా తీసుకుని బ్యాంక్ కు వెళ్లాడు. ‘క్యూ’లో నిలబడ్డ ధర్మేంద్ర, తన కూతురుని ఒక పక్కకు కూర్చోబెట్టాడు. తన తండ్రి క్యూలో ఉండగానే, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కూతురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ సంఘటన అక్కడి వారిని కలచివేసింది.

  • Loading...

More Telugu News