: ఇదో రకం నిరసన.. ఏటీఎంకు పూలదండలు వేసి హారతిచ్చిన మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
హైదరాబాద్‌లోని కొత్తపేటలో పని చేయకుండా ఉన్న ఆంధ్రాబ్యాంకు ఏటీఎంకు కాంగ్రెస్ నేత, ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పూలదండలు వేసి, హారతి ఇచ్చి, కొబ్బరి కాయకొట్టి పూజలు చేసి తన నిరసనను తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకోకుండా కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గొప్పలకు పోతూ ఎవరూ చేయని పనిని తాము చేశామని చాటిచెప్పుకోవడానికి మాత్రమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. చిల్లర నోట్లు దొరకకపోవడంతో ప్రజలు నిత్యావసర సరుకులు కూడా కొనుక్కోలేని స్థితిలో కష్టాలు పడుతున్నారని సుధీర్ రెడ్డి విమర్శించారు. తమ నిర్ణయంతో తలెత్తే ఇబ్బందులను గురించి చర్చింఛకుండానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. దీనివల్ల దేశంలో అన్ని రంగాలకు తీవ్రనష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. కొత్త రెండు వేల రూపాయల నోటు ఎందుకు ఉపయోగపడడం లేదని ఆ నోటును రద్దు చేయాలని, రూ.500 నోట్లను చలామణిలోకి తీసుకొచ్చి ప్రజల కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.