: మోదీ, జైట్లీ ఆర్థికవేత్తలు కారు... నీ తెలివి ఇంతేనా?: ఉర్జిత్ పటేల్ పై విరుచుకుపడ్డ బ్యాంకు అధికారుల సమాఖ్య
ఏమాత్రం ముందుచూపు, ముందస్తు ఆలోచనలు లేకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని బ్యాంకు అధికారుల సమాఖ్య డిమాండ్ చేసింది. ప్రణాళిక లేకుండా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయంతో పని ఒత్తిడి పెరిగి 11 మంది బ్యాంకు అధికారులు మరణించారని, క్యూలైన్లలో ప్రజలు చనిపోతున్నారని సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ థామస్ ఫ్రాంకో గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు ఆర్థిక వేత్తలు కారని, ఓ ఆర్థికవేత్తగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత పటేల్, నోట్ల రద్దు వంటి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. రద్దు చేసే ముందు రోడ్ మ్యాప్ కరవైందని, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న గందరగోళానికి, సామాన్య ప్రజల ఆందోళన, మరణాలకూ ఇదే కారణమని ఆయన అన్నారు. రూ. 500 నోట్లు లేకుండా రూ. 2 వేల నోట్ల విడుదల నిర్ణయం అత్యంత తప్పిదమని చెప్పిన ఫ్రాంక్, రూ. 2 వేల నోట్లు సిద్ధం చేసే బదులు రూ. 500 నోట్లను, రూ. 100 నోట్లను రెడీ చేసివుంటే పరిస్థితి ఈ స్థాయికి దిగజారేది కాదని అంచనా వేశారు. నోట్ల సైజు తగ్గించాలని భావించినప్పుడు ఏటీఎంలలో వాటిని సర్దుబాటు చేసే అంశం గుర్తుకు రాకపోవడం వింతగా ఉందని ఫ్రాంకో వ్యాఖ్యానించారు. ఆపై పొంతన లేని ప్రకటనలు రోజుకొకటి చేస్తూ, ప్రజలను ఆర్థిక శాఖ, ఆర్బీఐ తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయని, అన్నింటికీ బాధ్యత వహించి ఉర్జిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.