: కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలి: కేటీఆర్
ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతున్నట్టుగా టీమిండియాలా పని చేయాలని, కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో రాష్ట్రాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మొసళ్లను పట్టుకోవడం కోసం చెరువులో నీటిని తోడి చేపలను చంపకూడదని అన్నారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా రైతులు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన చెప్పారు. నల్లధనం ఎవరి వద్ద ఉంటుందన్నది బహిరంగ రహస్యమని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారిపై సమర్థవంతమైన చర్యలు తీసుకోకుండా, వేరేగా తీసుకునే ఎలాంటి నిర్ణయాలైనా సాధారణ ప్రజలను ఇబ్బంది పెడతాయని ఆయన పేర్కొన్నారు. నల్లధనం, అవినీతిని అంతం చేసే ఎలాంటి చర్యకైనా టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. అదే సమయంలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఆయన చెప్పారు. నిర్ణయం కేంద్రం తీసుకున్నా, దాని వల్ల ప్రభావితమయ్యేది రాష్ట్రాలని ఆయన చెప్పారు. రాష్ట్రాల ఆదాయం తగ్గిపోతుందని, అందుకే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్రాలను కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలని ఆయన తెలిపారు.