: ఇకపై చెన్నై రైల్వేస్టేషన్లలో, రైళ్లలో సెల్ఫీలపై నిషేధం
ఇకపై చెన్నై రైల్వేస్టేషన్లలో, రైళ్లలో సెల్ఫీలు తీసుకోవడం నిషేధం. ఈ మేరకు గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) చెన్నై నిర్ణయించింది. ఈ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రైల్వేస్టేషన్లలో జరిగే విషాదకర ఘటనల్లో 30 శాతం సెల్ ఫోన్ల సంబంధితమైనవేనని తమ దర్యాప్తులో తేలినట్లు అధికారులు పేర్కొన్నారు. రెండు నెలల క్రితం కదులుతున్న రైలులో సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు జారి కిందపడ్డ ఇరవై రెండేళ్ల యువకుడి సంఘటనను ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావించారు. రెండు నెలల తర్వాత కోమా నుంచి అతను బయటకు వచ్చాడని, ఆ యువకుడిని పార్థసారథిగా గుర్తించామని, చికిత్స పొందుతున్న ఆ యువకుడు గత బుధవారమే మృతి చెందాడని అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనల నేపథ్యంలోనే చెన్నై రైల్వేస్టేషన్లలో, రైళ్లలో సెల్ఫీలు తీసుకోవడంపై నిషేధం విధించామని అధికారులు వివరించారు.