: విజయవాడ బ్యాంకు డిపాజిట్లపై ఐటీ శాఖ నజర్.. రూ.2.5 లక్షలు దాటిన అకౌంట్లపై నిఘా
విజయవాడలో అకస్మాత్తుగా పెరిగిన బ్యాంకు డిపాజిట్లపై ఐటీ శాఖ దృష్టిసారించింది. నోట్ల రద్దు తర్వాత మామూలు ఖాతాల్లోనూ అసాధారణ రీతిలో నగదు జమ పెరగడంతో వివరాలు సేకరించే పనిలో పడింది. రూ.2.5 లక్షలకు పైబడి నగదు జమ చేసిన వారి వివరాలు పంపాలని బ్యాంకర్లకు లేఖలు రాసింది. ఇక నుంచి ప్రతివారం వివరాలు పంపాలని ఆదేశించింది. ఐటీ ఆదేశాలతో రూ.రెండున్నర లక్షలకు పైబడి నగదు జమ చేసిన వారి వివరాలను బ్యాంకర్లు సేకరిస్తున్నారు. నగదు మార్పిడి, జమ వివరాలను వెలికి తీస్తున్నారు. ఇప్పటికిప్పుడు వివరాలు పంపలేమని, కొంత సమయం కావాలని ఐటీ అధికారులను కోరారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు జమకు పలువురు నల్లకుబేరులు జన్‌ధన్ ఖాతాలను ఉపయోగించుకుంటున్నట్టు గుర్తించిన ఐటీ శాఖ వారికి చెక్ చెప్పేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగానే బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వేరేవారి ఖాతాల్లో నగదు జమ చేసేవారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించనున్నట్టు హెచ్చరించింది.