: వైఫై ఫస్ట్.. శృంగారం నెక్ట్స్.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన అధ్యయనం
మానవ జీవితంతో టెక్నాలజీకి విడదీయరాని సంబంధం ఉందనేది కాదనలేని సత్యం. మానవ దైనందిన జీవితాల్లో భాగంగా మారిపోయిన టెక్నాలజీ వారిని పూర్తిగా లోబరుచుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ప్రస్తుతం వైఫై పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇంటర్నెట్ వాడకం రోజురోజుకు పెరిగిపోయిన నేపథ్యంలో వైఫై ప్రాధాన్యం మరింత పెరిగింది. మనుషులతో పూర్తిగా పెనవేసుకుని పోయిన వైఫై వారిని శారీరక, మానసిక అవసరాల నుంచి కూడా దూరం చేసిందని అధ్యయనం తెలిపింది. ఐపాస్ గ్లోబల్ మీడియా కనెక్టివిటీ సంస్థ 1700 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీరిలో చాలామంది శృంగారం కంటే కూడా వైఫైకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేలింది. మొత్తం 1700 మందిలో 40 శాతం మంది తమ దైనందిన జీవితంలో వైఫై అతి ముఖ్యమైనదని, శృంగారానికి కన్నా వైఫైకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. 37 శాతం మంది శృంగారం తర్వాతే వైఫైకి ఓటు వేయగా 14 శాతం మంది చాక్లెట్లు, 9 శాతం మంది ఆల్కహాల్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు తేలింది. తక్కువ ధరకు లభిస్తుండడం, వేగం ఎక్కువ కావడం, ఎక్కడైనా లభించే అవకాశమే అందరికీ కావాలని ఐపాస్ అధికారి పాట్రికా హుమే పేర్కొన్నారు. వైఫై తమ జీవితాలను మెరుగుపరిచినట్టు 75 శాతం మంది తెలిపారన్నారు. సాంకేతికత మానవ జీవితాలతో ఎంతగా పెనవేసుకుపోయిందీ చెప్పేందుకు ఇదో చక్కని ఉదాహరణ అని హుమే వివరించారు.