: విజయవాడలో కొత్త నోట్ల డోర్ డెలివరీ.. 30 శాతం కమిషన్‌తో రూ. కోటి నుంచి ఎంతైనా!..కలకలం రేపుతున్న ముఠా వ్యవహారం
నోట్ల మార్పిడి కోసం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం మాత్రం ఉండడం లేదు. కానీ విజయవాడలో మాత్రం కావాలనుకుంటే కొత్త నోట్లు నేరుగా ఇంటికే డెలివరీ అవుతున్నాయి. కోటి రూపాయల నుంచి రూ.వంద కోట్ల వరకు ఎంతైనా కూర్చున్నచోటు నుంచే మార్చుకునే వెసులుబాటును ఓ ముఠా కల్పిస్తోంది. కాకపోతే 30 శాతం కమీషన్‌గా ఇచ్చుకోవాలి అంతే. ఒక్క నోటు దొరక్క ప్రజలు అల్లాడిపోతుంటే ఏకంగా కట్టలకు కట్టలు అవలీలగా మార్చేస్తామంటున్న ముఠా ఓ న్యూస్ చానెల్‌కు అడ్డంగా దొరికిపోయింది. బెజవాడలో అడ్డగోలుగా సాగుతున్న ఈ ముఠా బాగోతం బట్టబయలైంది. మీ దగ్గర ఎన్ని కోట్ల నల్ల డబ్బు ఉన్నా దానిని చిటికెలో మార్చేస్తామంటూ ఓ మహిళ నేరుగా ఫోన్లు చేస్తూ దందా సాగిస్తుండడం సంచలనం రేపింది. చానల్ ప్రతినిధులకు ఫోన్ చేసిన ఆమె ముందుగా చెప్పిన స్థలానికి మరో వ్యక్తితో కలిసి వచ్చింది. అతడిని తన సోదరుడిగా పరిచయం చేసుకుంది. నల్లడబ్బును తామెలా మార్చేది వివరించింది. నగరంలో ప్రముఖ ఆస్పత్రికి చెందిన నోట్లను కూడా తామే మార్చామని, తమ ముఠాలో 30 మంది వరకు పోలీసులు కూడా ఉన్నారని వివరించింది. తమ వద్ద ఉన్నవి అసలైన కొత్త నోట్లేనని పేర్కొంటూ బయటకు తీసి చూపించింది. డబ్బు ఎంతైనా చిటెకెలో మార్చేస్తామంటూ హామీ ఇచ్చింది. మొత్తం డోర్ డెలివరీ చేస్తామని తెలిపింది. ముఠా వ్యవహారం బయటకు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విచారణకు ఆదేశించారు. కాగా కమీషన్ల పేరుతో భారీ దందాకు తెరలేపిన ముఠాలో మొత్తం పదిమంది సభ్యులు ఉన్నట్టు మహిళ చెప్పిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.