: కరెన్సీ కోసం అవే కష్టాలు.. అవే పడిగాపులు.. రోజులు గడుస్తున్నా మారని పరిస్థితి
రోజులు గడుస్తున్నా ప్రజలకు నోట్ల రద్దు కష్టాలు తగ్గడం లేదు. బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు క్యూలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక నిన్న ఆదివారం నాడు అయితే పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బ్యాంకులు తెరుచుకోక, ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. 8వ తేదీనాడు పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత వచ్చిన శని, ఆదివారాలు పనిచేయడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కానీ నిన్న ఆ వెసులుబాటు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏటీఎంలలోనూ డబ్బులు నిండుకున్నాయి. దీంతో ఆశగా వెళ్లిన ప్రజలు నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకోకపోయినప్పటికీ కొందరు ఖాతాదారులకు రెండు వేల రూపాయలు డ్రా చేసుకున్నట్టు మెసేజ్‌లు రావడంతో లబోదిబోమన్నారు. డ్రా చేసుకున్నట్టు వచ్చిన డబ్బులు తిరిగి ఖాతాలో జమ అవుతాయని తెలిసినప్పటికీ, ఆ రోజుకు పరిమితి అయిపోవడంతో మరో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దు చేసి దాదాపు రెండు వారాలు కావస్తున్నప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏటీఎంలలో తగినన్ని డబ్బులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.