: రెండు రోజుల్లోనే 4 టన్నుల బంగారం కొనుగోళ్లు.. నోట్ల రద్దుతో ఐదు రెట్లు పెరిగిన విక్రయాలు
పెద్ద నోట్ల రద్దుతో మైండ్ బ్లాంక్ అయిన అక్రమార్కులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. దారుల కోసం అన్వేషిస్తున్నారు. బ్యాంకుల్లో మార్చుకునేందుకు దారులు పూర్తిగా మూసుకుపోవడంతో వారి దృష్టి బంగారం కొనుగోళ్లపై పడింది. పెద్దమొత్తంలో నగలు కొనుగోలు చేస్తూ బ్లాక్‌ను వైట్‌గా మార్చుకునే పనిలో పడ్డారు. వారి కొనుగోళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 8న పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత రెండు రోజుల్లోనే బంగారం అమ్మకాలు ఏకంగా ఐదు రెట్లు పెరిగాయి. 48 గంటల్లోనే 4 టన్నుల బంగారం అమ్మకాలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 374 పెద్ద నగల దుకాణాల్లో 8వ తేదీ తర్వాత రెండు రోజుల్లో 4 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగినట్టు ఆర్థిక పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. అకస్మాత్తుగా పెరిగిన బంగారం అమ్మకాలు పలు అనుమానాలకు తెరలేపాయని అధికారులు సైతం చెబుతున్నారు. ఆ లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.