: ఇరాక్ సైన్యం, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల మధ్య భీకరపోరు
ఇరాక్ లోని మోసుల్ నగరాన్ని స్వాధీనం చేసుకొని ఎంతో కాలంగా అక్కడి నుంచే తమ కార్యక్రమాలను కొనసాగిస్తోన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఇరాకీ సేనలు గత నెల 17 నుంచి భారీ ఎత్తున ఆపరేషన్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రవాదులపై విరుచుకుపడుతున్న ఇరాకీ సేనలు వారి నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కుంటున్నాయి. ఇప్పటికే మోసుల్ ప్రాంతంలోకి ప్రవేశించిన ఇరాకీ సేనలు ఈ రోజు ఉదయం పట్టణ తూర్పు ప్రాంతం ముహరబీన్, ఉలామాల్లోకి దూసుకెళ్లాలని చూశాయి. అయితే ఇరాకీ సేనలు, ఉగ్రవాదులకు మధ్య అక్కడ పెద్ద ఎత్తున కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఇరాకీ సైన్యంపై స్నిపర్ రైఫిల్స్, గ్రెనేడ్లతో ఎదురుదాడికి దిగారు. దీంతో ఆయా ప్రాంతాలు దట్టమైన పొగతో నిండిపోయాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విజయం సాధించిన ఇరాకీ సైన్యం మోసుల్ని కూడా స్వాధీనపరుచుకుంటే ఐసిస్ తన ప్రాబల్యం కోల్పోతుంది.