: ఇరవై వేల కోసం 15 కేజీల బరువు మోయాల్సి వచ్చింది!
అత్యవసరంగా డబ్బు కావాలని బ్యాంకుకు వెళితే 15 కేజీల బరువున్న నాణేల మూట దక్కింది ఢిల్లీలోని ఓ వ్యక్తికి. రద్దయిన నోట్ల కారణంగా దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల వందనోట్లే కాకుండా కొత్త రూ.2000 నోట్లు కూడా కొన్ని బ్యాంకులు, ఏటీఎంలలో లభ్యం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ప్రజాసంబంధాల అధికారిగా పనిచేస్తున్న ఇంతియాజ్ ఆలమ్ జామియా సహకార బ్యాంకుకు వెళ్లి తనకు అర్జెంటుగా రూ.20వేలు కావాల్సి ఉందని బ్యాంకు సిబ్బందిని కోరారు. అయితే, భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి తమ బ్యాంకుకు అతి తక్కువ మొత్తంలో డబ్బు అందిందని, అంత మొత్తం ఇప్పుడు ఇవ్వలేమని చెప్పారు. తమ దగ్గర నాణేలు మాత్రమే ఉన్నాయని చెబుతూ, అవి తీసుకుంటారా? అని అడిగారు. డబ్బు అవసరం ఉన్న ఇంతియాజ్ ఇక ఆ చిల్లరను తీసుకోకతప్పలేదు. పదిహేను కీజీల బురువున్న రూ.20 వేల పది రూపాయల నాణేలను తీసుకున్నారు. అవన్నీ ఓ సంచీలో వేసుకొని ఇంటికి వెళ్లిపోయారు.