: తిరుపతి నుంచి హైదరాబాద్ వెళుతున్న స్కార్పియో బోల్తా.. ఐదుగురు హైదరాబాదీలు మృతి
వనపర్తిలోని కొత్తకోట మండలం అమడబాకుల రహదారిపై ఈ రోజు ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం బోల్తా పడడంతో వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వారంతా ఇటీవలే తిరుమల తిరుపతికి వెళ్లారని, అక్కడి నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతులంతా హైదరాబాద్ కు చెందిన వారేనని చెప్పారు. అతి వేగంతో స్కార్పియోను నడపడమే ప్రమాదానికి కారణమైందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.