: సైబర్‌ క్రైం కానిస్టేబుల్ బ్యాంకు ఖాతా నుంచే డబ్బు మాయం చేసిన కేటుగాడు!


కేటుగాళ్లు చేప్పే మాట‌ల‌ను న‌మ్మి మోస‌పోకూడ‌ద‌ని సైబర్‌ క్రైం పోలీసులు ప్రకటనలు ఇస్తుంటారు. అయితే ఆ శాఖలో పనిచేసే ఓ కానిస్టేబులే ఆ విధంగా మోస‌పోయిన ఘ‌ట‌న హైద‌రాబాద్‌లో చోటు చేసుకుంది. ఇటీవ‌లే ఓ సైబర్‌ క్రైం కానిస్టేబుల్ వాట్సప్‌కి ఓ మెసేజ్ వ‌చ్చింది. మీరు మూడు రోజుల క్రితం ఓ షాపింగ్ చేశారు క‌దా.. అందులో మీకు ఓ డ్రా త‌గిలింది, రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు గెలుచుకున్నారు అంటూ మోస‌గాళ్లు ఆ మెసేజ్ లో చెప్పారు. దీంతో నిజంగానే త‌న‌కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని అనుకున్న స‌ద‌రు కానిస్టేబుల్ మోస‌గాళ్లు కోరిన‌ట్లు త‌న వ్య‌క్తిగ‌త వివ‌రాలు పంపాడు. అవ‌త‌లి నుంచి కొన్ని గంటల్లోనే కానిస్టేబుల్‌కి ఫోన్‌ వచ్చింది. డ్రాలో గెలుచుకున్న డ‌బ్బుని నేరుగా బ్యాంక్‌లోనే డిపాజిట్ చేస్తామ‌ని వారు చెప్పారు. అందుకోసం డెబిట్‌ కార్డు వివరాలు చెప్పాలని అడిగిన మోస‌గాళ్ల మాట‌లు నమ్మిన కానిస్టేబుల్.. అదృష్ట‌ల‌క్ష్మి త‌న త‌లుపు త‌డుతోంద‌నుకుని డెబిట్‌ కార్డ్‌ నెంబర్‌, ఎక్స్‌ఫైరీ డేట్‌, సీవీవీ నెంబర్‌తో పాటు కొద్ది సేప‌టికి త‌నకు వ‌చ్చిన ఓటీపీ నెంబ‌రు కూడా చెప్పేశాడు. ఆ త‌రువాత కానిస్టేబుల్ ఫోన్ పెట్టేశాడు. ఆ వెంట‌నే త‌న సెల్‌ఫోన్‌కి వ‌చ్చిన‌ ఓ మెసేజ్ చూసి షాక్‌కి గుర‌య్యాడు. త‌న‌ అకౌంట్‌ నుంచి రూ.60 వేల రూపాయ‌లు మాయ‌మ‌య్యాయ‌ని తెలుసుకొని మోస‌పోయిన‌ట్లు గ్ర‌హించాడు. కానిస్టేబుల్‌కి తెలిసిన ప‌లువురు వ్య‌క్తులే ఈ మోసానికి పాల్ప‌డిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది. నిందితుల‌ని ప‌ట్టుకునే ప‌నిలో పోలీసులు ఉన్నారు.

  • Loading...

More Telugu News