: అసోంలో సైన్యం, అనుమానిత ఉల్ఫా ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు.. ఒక జవాను మృతి
అసోంలోని టిన్‌సుకియా, పెంగ్రీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో అనుమానిత ఉల్ఫా ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందుకున్న భారత జవాన్లు అక్కడకు చేరుకున్నారు. ఈలోగా, అనుమానిత ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులకు దిగారు. కాల్పులను ఎదుర్కునేందుకు జవాన్లు కూడా కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక జవాను మృతి చెందగా మరో నలుగురు జవాన్లకు తీవ్రగాయాలయినట్లు అసోం డీజీపీ ముఖేష్ సాహాయ్ తెలిపారు. గాయాలపాలయిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.