: ప్రజల కష్టాలు తీర్చని బ్యాంకులెందుకు.. ఇక్కడి గాలి పీలుస్తూ చెప్పిన మాట వినరా?: చంద్రబాబు ఫైర్
బ్యాంకుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలు తీర్చని బ్యాంకులు ఎందుకంటూ మండిపడ్డారు. నోట్ల రద్దుపై ప్రజలు పడుతున్న కష్టాలపై కేంద్రం, ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ రాసిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు తక్షణం పదివేల కోట్ల రూపాయలు పంపాలని ఆర్బీఐని కోరినట్టు తెలిపారు. నోట్ల రద్దుతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయన్నారు. వారి సమస్యలను తీర్చాల్సిన బ్యాంకులు మీనమేషాలు లెక్కిస్తున్నాయన్నారు. ఇక్కడి గాలి పీలుస్తూ, చెప్పిన మాట వినకుంటే ఎలా? అని ప్రశ్నించారు. చెప్పిన మాట వినకుంటే ఎక్కడ మాట్లాడాలో తనకు తెలుసని చంద్రబాబు హెచ్చరించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న సమయంలో రెండు వేల నోట్లు ప్రవేశపెట్టడం సరికాదన్నారు. రూ.2వేల నోటుతో నల్లధనం ఎలా పోతుందని చంద్రబాబు కేంద్రాన్ని ప్రశ్నించారు.