: జలియన్ వాలా బాగ్ ఊచకోత కన్నా దారుణమైన నిర్ణయమిది: నిప్పులు చెరిగిన సామ్నా
మిత్రపక్షమైన బీజేపీని శివసేన తీవ్రస్థాయిలో విమర్శించింది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు చేపట్టిన నిరసనదీక్షకు మద్దతు తెలిపిన శివసేస తన ఎంపీలను రాష్ట్రపతి భవన్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనమని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అధికారిక పత్రిక సామ్నాలో నోట్ల రద్దుపై నిప్పులు కురిపించే కథనం ప్రచురించింది. కేంద్ర ప్రభుత్వం తన ఏకపక్ష నిర్ణయాలతో దేశ ప్రజలను నిస్సహాయులుగా మార్చి, ఆకలికి చచ్చే స్థితికి తీసుకువచ్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆంగ్లేయులు జరిపిన జలియన్ వాలాబాగ్ ఊచకోత కంటే ఘోరమని పేర్కొంది. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బులను మార్చుకోవడం కోసం బ్యాంకుల ముందు ప్రజలు క్యూలలో నిల్చుని కష్టాలు పడడటాన్ని గొప్ప దేశభక్తిగా బీజేపీ నేతలు పేర్కొనడాన్ని శివసేన తీవ్రంగా తప్పుపట్టింది. ఇలాంటి సమయంలో బాలాసాహెబ్ థాకరే బతికి ఉంటే బీజేపీ నేతల నోరు మూయించేవారని సామ్నా హెచ్చరించింది. ఇక ప్రస్తుత పరిస్థితిని రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్న తీరుతో పోల్చి, బీజేపీ తీరును థాకరే కడిగిపడేసేవారని సామ్నా పేర్కొంది. ప్రజలను నిలువు దోపిడీ చేసి, వారిని బిచ్చగాళ్ల కంటే దారుణంగా బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబెట్టి, దానినే దేశభక్తిగా ప్రచారం చేసుకోవడం దారుణమని, దేశ ప్రజల నిస్సహాయతను దేశభక్తి అంత గొప్ప, ఉదాత్తభావనతో పోల్చడం అవమానమని సామ్నా అభిప్రాయపడింది. అలాంటి మాటలు మాట్లాడుతున్నవారి నాలుకలు తెగ్గోసినా తప్పు లేదని సామ్నా అభిప్రాయపడింది. అంతటితో ఆగని శివసేన, మోదీ ప్రభుత్వం సాధించిన అసాధారణ విజయంగా చెప్పుకొంటున్న సర్జికల్ స్ట్రైక్స్ తరువాత కూడా సరిహద్దుల్లో పాక్ దాడులు కొనసాగుతుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. అంతే కాకుండా నోట్ల మార్పిడి సమయంలో బ్యాంకు అధికారులు వినియోగదారుల చేతికి ఇంకు పూయడాన్ని, జాతీయ నేరంగా అభివర్ణించింది.