: ఇక పొలిటికల్ రీ ఎంట్రీ... బీజేపీపై గాలి జనార్దనరెడ్డి దృష్టి
ఓ ఆడపిల్లకు తండ్రిగా, ఆమె వివాహాన్ని వైభవంగా జరిపించి తన బాధ్యతను నెరవేర్చిన మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి, మరోసారి క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. గత నాలుగైదు నెలలుగా కుమార్తె వివాహ పనుల్లో బిజీగా ఉన్న ఆయన, ఆ పని ముగియగానే రాజకీయాల వైపు అడుగులు వేయాలని అనుకుంటున్నట్టు ఇప్పటికే తన సన్నిహిత వర్గాల వద్ద స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 2011లో గనుల అక్రమ తవ్వకం ఆరోపణలపై అరెస్ట్ అయి, ఆపై షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన, రాజకీయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇక కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి దేశవ్యాప్తంగా అన్ని దినపత్రికల వార్తల్లోకి ఎక్కారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే చర్చకు కారణమయ్యారు. గతంలో బీజేపీలో కీలక నేతగా ఉండటం, మంత్రిగానూ పని చేసివుండటంతో ఆయన బీజేపీలోకే వెళతారని అంచనా. పైగా కేంద్రంలో కూడా ఆ పార్టీయే అధికారంలో ఉండటంతో సహజంగా గాలి ఆలోచన అటువైపే ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక ఆయన కూతురి పెళ్లికే ఏ నేతనూ వెళ్లవద్దని ఆదేశించిన బీజేపీ, గాలిని తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తుందా? ఒకవేళ ఆహ్వానించకుంటే, ఆయన మరో పార్టీలోకి వెళతారా? అన్నవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.