: మోదీజీ.. మా విముక్తి కోసం సర్జికల్ దాడులు చేయండి..!: ప్రధానిని కోరేందుకు సిద్ధమవుతున్న బాలలు
ఉగ్రవాదులు, నల్లకుబేరులపైనే కాదు.. తమపైనా సర్జికల్ దాడులు నిర్వహించి తమకు విముక్తి కల్పించాలని కోరేందుకు బాలలు సిద్ధమవుతున్నారు. ప్రపంచ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 20న కొందరు చిన్నారులు ప్రధాని నరేంద్రమోదీని కలిసి బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం సర్జికల్ స్ట్రయిక్స్ జరపాలని కోరనున్నారు. బాల్య వివాహాల కారణంగా చాలామంది పిల్లలు పదో తరగతి కూడా పూర్తికాకుండానే స్కూలు మానేస్తున్నారని, బాలకార్మికులుగా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని చైల్డ్ చాంపియన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు వైశాక్షి విశ్వాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చిన్నారులతో కలిసి ఆమె ప్రధానిని కలవనున్నారు. ఈ సందర్భంగా బాలల ఇబ్బందుల గురించి వివరిస్తారు.