: కొత్త నోట్లు ఇస్తేనే చికిత్స చేస్తామన్న ఆస్పత్రి.. చిన్నారి మృతి.. చెన్నైలో విషాదం
పెద్ద నోట్ల రద్దు ఓ చిన్నారి ప్రాణం తీసింది. కొత్త నోట్లు ఇస్తేనే చికిత్స చేస్తామని ఓ ఆస్పత్రి భీష్మించుకుంది. అప్పటి వరకు చికిత్స కొనసాగించేది లేదని తేల్చి చెప్పింది. ఈలోగా పరిస్థితి విషమించడంతో అభంశుభం తెలియని చిన్నారి మృతి చెందింది. చెన్నైలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక గోపిచెట్టి పాళియానికి చెందిన రైతు శివకుమార్(30), రంజిత(24) దంపతులు. వారి కుమార్తె దీపశ్రీ(4) రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. దీంతో మంగళవారం రాత్రి చిన్నారిని సింగానల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వెంట తెచ్చుకున్న వందనోట్లు అయిపోవడంతో రూ.500 నోట్లతో బిల్లు చెల్లించబోయారు. అయితే పాత నోట్లు తీసుకోబోమని, కొత్త నోట్లు చెల్లించే వరకు చికిత్స చేసేది లేదని ఆస్పత్రి యాజమాన్యం కరాఖండిగా చెప్పింది. అస్వస్థతతో బాధపడుతున్న చిన్నారిని వైద్యులు పట్టించుకోకపోవడంతో పరిస్థితి విషమించి బుధవారం రాత్రి ప్రాణాలు విడిచింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని బాధిత తల్లిదండ్రులను శాంతింపజేశారు. కాగా నోట్లు రద్దు కారణంగా దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య గురువారం నాటికి 47కు చేరుకుంది.