: పాక్ సైన్యానికి అందిన చైనా తయారీ డబ్ల్యుజడ్-10 థండర్‌బోల్ట్ ఎటాక్ హెలికాప్టర్లు
తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తూ భారత సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ ప్రస్తుతం సైనిక విన్యాసాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విన్యాసాలను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ కూడా వీక్షిస్తున్నారు. అందులో చైనా తయారీ డబ్ల్యుజడ్-10 థండర్‌బోల్ట్ ఎటాక్ హెలికాప్టర్లను పాకిస్థాన్ వినియోగించింది. చైనా నుంచి ఆ విమానాలను కొనుగోలు చేసినట్లు పాకిస్థాన్ ఇంతవరకు బయటపెట్టలేదు. అయితే, తాజాగా సైనిక విన్యాసాల్లో వాటిని ఒకేసారి ప్రదర్శిస్తూ చూపించింది. డబ్ల్యుజడ్-10 థండర్‌బోల్ట్ ఎటాక్ హెలికాప్టర్ల ద్వారా శత్రుదేశాలపై మిసైళ్లను కూడా ప్రయోగించే అవకాశం ఉంటుంది. వీటి సాయంతో యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయవచ్చు. ఈ హెలికాప్టర్లు అమెరికా తయారుచేసిన ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్ల అంతటి సామర్థ్యంతో పనిచేస్తాయి. ఇటువంటి హెలికాప్టర్లను ఇప్పటి వరకు గల్ఫ్ యుద్ధం సమయాల్లోను, అఫ్ఘానిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఉపయోగించారు. గత సంవత్సరం భారతదేశం 310 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తూ అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్ల కోసం ఆర్డర్ చేసింది. భవిష్యత్తులో ఇవి మనకు అందనున్నాయి. అయితే, భారత్ కు అమెరికా నుంచి ఆ హెలికాఫ్టర్లు అందకముందే చైనా తన హెలికాఫ్టర్లను పాకిస్థాన్‌కు సరఫరా చేసింది.