: పెద్దనోట్ల పని ఒత్తిడితో రోహ్ తక్ సహకార బ్యాంకు మేనేజర్ మృతి
పెద్దనోట్లు రద్దు అయినప్పటి నుంచి ఖాతాదారులకు పాతనోట్లు ఇచ్చే పనిలో బ్యాంకుల సిబ్బంది తలమునకలయ్యారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని రోహ్ తక్ సహకార బ్యాంకు మేనేజర్ రాజేష్ కుమార్ తీరిక లేకుండా బ్యాంకు పనుల్లో మునిగిపోయారు. ఇంటికి వెళితే మర్నాడు ఉదయం బ్యాంక్ కు రావడం ఆలస్యమవుతుందని భావించిన ఆయన మూడు రోజులుగా బ్యాంకులోనే ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న ఉదయం రాజేష్ ఛాంబర్ వద్దకు సెక్యూరిటీ గార్డు వెళ్లాడు. తలుపు కొడుతున్నప్పటికీ రాజేష్ స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డు, అక్కడి ఉద్యోగులను పిలిచాడు. వారందరూ కలిసి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఆయన చనిపోయి ఉన్నట్లు గమనించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా రాజేష్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ, ఆయనకు గుండెజబ్బు ఉందని, మందులు వాడుతుంటారని తెలిపారు.