: న్యూఢిల్లీలో ఒకే వేదికపై కేజ్రీవాల్, మమతా బెనర్జి.. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు
పెద్దనోట్ల రద్దు అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌మండీ వద్ద కార్మికులు, వ్యాపారులు, రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బ్యాంకుల్లో రూ.2 వేల నోట్లు మాత్రమే ఇస్తుండడంతో కొత్త పెద్దనోట్లు పట్టుకొని జనం రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. తినేందుకు కూడా తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈ విషయంలో నిరాహార దీక్ష చేద్దామనుకున్నానని, అయితే తనకి షుగర్ ఉండడంతో, నిరాహార దీక్ష చేయకూడదని డాక్టర్లు వారించారని కేజ్రీవాల్ అన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చానని చెప్పారు. కొందరు వ్యక్తులు అక్రమంగా డబ్బులు మారుస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. రూ.2 వేల నోటుతో అవినీతి అంతం అవుతుందా..? అని ఆయన ప్రశ్నించారు. వ్యాపార లావాదేవీలు స్తంభించి ఎన్నో ఇబ్బందులు తలెత్తాయని విమర్శించారు.