: రూ. 4,500 నుంచి రూ. 2,000కు తగ్గిన పాత కరెన్సీ మార్పు
పాత కరెన్సీని మార్చుకునే పరిమితిని రూ. 4,500 నుంచి రూ. 2,000కు తగ్గిస్తున్నట్టు ఆర్థిక శాఖ కార్యదర్శి శశికాంత్ దాస్ వెల్లడించారు. మరింత మందికి పాత నోట్లను మార్చుకునే అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేలిపై సిరా పెట్టడం మొదలైన తరవాత, ఒకసారి వచ్చిన వారు వెంటనే మళ్లీ రాకుండా చేయడంతో పాటు అత్యధికులకు నోట్లను మార్చుకునే అవకాశాన్ని దగ్గర చేసినట్లయిందని ఆయన అన్నారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని వ్యాఖ్యానించిన ఆయన, అప్పుడు తిరిగి ఈ మొత్తాన్ని పెంచుతామని అన్నారు. ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మార్పు రేపటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.