: రెండు వేలు నోట్లు వద్దండి... వంద నోట్లిచ్చి పుణ్యం కట్టుకోండి: వేడుకున్న పెద్దాయన
తనకు రూ. 2 వేల నోట్లు అక్కర్లేదని, వంద నోట్లిచ్చి పుణ్యం కట్టుకోవాలని ఓ పెద్దాయిన వేడుకుంటున్నారు. విజయవాడలో ఈ ఉదయం నుంచి బ్యాంకు ముందు 4,500 రూపాయల పాత కరెన్సీని మార్చుకునేందుకు వచ్చిన ఓ వయోవృద్ధుడు, తనకు 2 వేల కాగితాన్ని ఇవ్వబోగా, "దీన్ని ఎవరూ తీసుకోవడం లేదటగా. నాకెందుకు బాబూ? వంద నోట్లివ్వండి చాలు" అని వేడుకున్నాడు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న మీడియా చిత్రీకరిస్తుండటంతో, బ్యాంకు సిబ్బంది అతనికి రూ. 100 నోట్లను ఇచ్చి పంపారు. ఆపై ఆయన మాట్లాడుతూ, తాను ఉదయం నుంచి బ్యాంకు దగ్గరే ఉన్నానని, మూడు గంటల పాటు నిలబడితే, ఈ డబ్బులు దొరికాయని, వీటిని పొలంలో పనిచేస్తున్న కూలీలకు పంచాల్సి వుందని చెప్పాడు. తనకు ఇంకా డబ్బు కావాలని, మరోసారి వచ్చి పాత నోట్లను మార్చుకోవాల్సి వుందని, రేపు తిరిగి వస్తానని తెలిపాడు.