: ఇదో యుద్ధం.. న‌ల్ల‌ధ‌నాన్ని నిర్మూలించ‌డంలో క‌ఠిన నిర్ణ‌యాలు త‌ప్ప‌వు: రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య


దేశాన్ని పట్టిపీడిస్తోన్న‌ న‌ల్ల‌ధ‌నంపై యుద్ధం చేస్తున్నామ‌ని, ఇదో మ‌హాయజ్ఞం అని కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు అన్నారు. ఈరోజు రాజ్య‌స‌భ‌లో పెద్ద‌నోట్ల ర‌ద్దు అంశంపై ఆయ‌న ప్ర‌సంగిస్తూ ప్ర‌తిప‌క్షాలు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌ను తిప్పికొట్టారు. న‌ల్ల‌ధ‌నాన్ని నిర్మూలించ‌డంలో క‌ఠిన నిర్ణ‌యాలు త‌ప్ప‌వని పేర్కొన్నారు. డిసెంబరు 30 తరువాత ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌నేదే త‌మ ప్ర‌భుత్వ ఉద్దేశమ‌ని చెప్పారు. పెద్ద నోట్ల ర‌ద్దు అంశాన్ని ముందుగానే వెల్ల‌డిస్తే న‌ల్ల‌కుబేరులు జాగ్ర‌త్త ప‌డేవార‌ని, అన్ని అంశాల‌ను ఆలోచించే ఆ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని వెంక‌య్య చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో స్వ‌ల్ప‌కాలికంగా ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ భ‌విష్య‌త్తులో దేశానికి మేలు జ‌రుగుతుంద‌ని వెంక‌య్య నాయుడు చెప్పారు. ఈ మ‌హాయ‌జ్ఞానికి అంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. న‌ల్ల‌ధ‌నం నిర్మూల‌న‌కు ప్ర‌భుత్వం కంక‌ణం క‌ట్టుకుందని చెప్పారు. న‌ల్ల‌ధ‌నం వివ‌రాలు వెల్ల‌డించాల‌ని న‌ల్ల‌కుబేరుల‌ను ముందుగానే కోరామ‌ని అన్నారు. మోదీ తీసుకున్న‌ నిర్ణ‌యాన్ని యావ‌త్ ప్ర‌పంచం మెచ్చుకుంటోందని ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌లంతా మోదీ నిర్ణ‌యంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News