: రద్దయిన నోట్లతో భరణం చెల్లించాలనుకున్నాడు... జైలుపాలయ్యాడు!
రద్దయిన పెద్ద నోట్లతో భరణం చెల్లించబోయాడు... కానీ, విధిలేని పరిస్థితుల్లో జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే, కోల్ కతాకు చెందిన రిటైర్డ్ ఇంజినీర్ గత ఏడేళ్లుగా తన భార్యకు దూరంగా ఉంటున్నాడు. వీరి విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. అయితే, ఆమె మెయింటెనెన్స్ కోసం నెలకు రూ. 8 వేలు ఇవ్వాలంటూ ఆయనను గతంలో కోర్టు ఆదేశించింది. అయినా, గత నాలుగేళ్లుగా ఆయన ఆమెకు ఏమీ చెల్లించలేదు. దీంతో, ఇప్పటి వరకు తన భార్యకు ఆయన చెల్లించాల్సిన మొత్తం రూ. 2.25 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో, తనకు ఎలాంటి భరణం చెల్లించడం లేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి ఆమె తీసుకొచ్చింది. దీంతో, మొత్తం డబ్బును ఆమెకు చెల్లించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఆయన సోదరుడు కోర్టు విచారణకు హాజరై.... ఆమెకు ఇవ్వాల్సిన భరణంలో రూ. 2 లక్షలను కోర్టులో చెల్లించాడు. రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకునేందుకు ఆమె తిరస్కరించింది. చెల్లుబాటులో ఉన్న నోట్లనే ఇవ్వాలని డిమాండ్ చేసింది. పెద్ద నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చని రిటైర్డ్ ఇంజినీర్ తరపు న్యాయవాది వాదించినా ఆమె ఒప్పుకోలేదు. జడ్జి కూడా ఆమె వాదనకు అభ్యంతరం చెప్పలేదు. చెక్, డీడీలను తీసుకోవడానికి కూడా ఆమె అంగీకరించలేదు. దీంతో, భరణం చెల్లించాల్సిన గడువు ముగిసిపోయింది. భరణం చెల్లించడంలో విఫలమైన రిటైర్డ్ ఇంజినీర్ కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీని విధించింది.