: చెన్నయ్ ఆర్బీఐ శాఖలోనూ డబ్బు అయిపోతుండడంతో తీవ్ర నిరాశ చెందుతున్న ప్రజలు


కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో దేశ వ్యాప్తంగా వరసగా ఎనిమిద‌వ రోజు ప్రజలు బ్యాంకులు, ఏటీఎం ముందు ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌లు బ్యాంకుల్లో డ‌బ్బు అందుబాటులో లేక‌పోవ‌డంతో న‌గ‌దు మార్పిడీ కోసం వ‌చ్చిన ఖాతాదారులు వెనుదిరుగుతున్నారు. అయితే, ఆర్బీఐ శాఖ‌లోనూ డబ్బు అయిపోతున్న సంఘ‌ట‌న‌ చెన్నై శాఖ‌లో చోటు చేసుకుంటుంది. బ్యాంకుకు వస్తున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా ఉండ‌డంతో తెచ్చిన వెంట‌నే నగదు అయిపోతోంది. దీంతో ఎంతో సేపు క్యూలైన్‌లో నిరీక్షించినప్పటికీ తమకు డబ్బు అందడం లేదని ప్ర‌జ‌లు నిరాశతో డ‌బ్బులు అందుకోకుండానే ఇంటికి వెళ్లిపోతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం డిసెంబర్ 30వ‌ర‌కు డబ్బు మార్చుకోవాల‌ని చెప్పింద‌ని, మ‌రోవైపు ఆర్బీఐ ఆఫీసులోనే డ‌బ్బు అయిపోతోంద‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. నిత్యావ‌స‌ర వ‌స్తువులు కొనుక్కోవ‌డానికి కూడా డ‌బ్బు ఉండ‌డం లేద‌ని ప్ర‌జ‌లు వాపోయారు. త‌మ వ్యాపారాలు, ప‌నులు ప‌క్క‌న‌బెట్టి క్యూ లైన్ల‌లో నించుంటున్నామ‌ని చెబుతున్నారు. 1960లో రిజర్వు బ్యాంకు చెన్నై శాఖ కార్యాలయాన్ని బ్యూటిఫుల్ ఫోర్ట్ గ్లాసిస్ ప్రాంతంలో నెలకొల్పారు. మామూలు రోజుల్లో ఈ కార్యాల‌యానికి వ‌చ్చే వారి సంఖ్య త‌క్కువ‌గానే ఉంటుంది. కానీ, పెద్ద‌నోట్లు ర‌ద్దు అయిన రోజు నుంచి ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో అక్క‌డ‌కు వ‌స్తున్నారు. ఎన్నో గంట‌లు బ్యాంకు ముందు నిల‌బ‌డితే చివ‌ర‌కు త‌మ‌కు డ‌బ్బు అయిపోయింద‌న్న వార్త వ‌చ్చింద‌ని పలువురు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కొత్త నోట్లు అయిపోవ‌డంతో బ్యాంకు అధికారులు 10, 5 రూపాయిల నాణేలను కూడా ప్ర‌జ‌ల‌కు ఇవ్వాల‌ని రిజర్వు బ్యాంకు అధికారులు యోచిస్తున్నారు. క్యూలో నిల‌బ‌డిన వారి వ‌ద్ద‌కు ఇత‌రులు వ‌చ్చి త‌మ డ‌బ్బును కూడా బ్యాంకులో ఇవ్వాల‌ని, అందుకు క‌మీష‌న్ కూడా ఇస్తామ‌ని చెబుతున్నారు. దీంతో ఒక్కొక్క‌రు ఐదు, ఆరు ఐడీ కార్డులపై ఒకేసారి డ‌బ్బు తీసుకుంటున్నారు. దీంతో వెంట వెంట‌నే డ‌బ్బు అయిపోతోంద‌ని స‌మాచారం.

  • Loading...

More Telugu News