: 9వ తారీఖు నుంచి నా దగ్గరే ఉంది... ఎవరూ తీసుకోవట్లా, ఏం చేయాలి?: రాజ్యసభలో సీతారాం ఏచూరి
రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరుగుతున్న వేళ, సమాజ్ వాదీ పార్టీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతుండగా, ఆయన పక్కనే కూర్చున్న సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి లేచి, నోట్ల రద్దు తరువాత ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తోందో చెప్పి అందరినీ నవ్వించారు. ఓ రెండు వేల రూపాయల కాగితాన్ని బయటకు తీసి చూపించిన ఆయన, "ఇది 9వ తారీఖు నుంచి నా దగ్గరే ఉంది. ఎవరూ తీసుకోవట్లేదు. పార్లమెంటులోని మన బ్యాంకు నుంచే తీసుకున్నా. ఇక్కడెక్కడా తీసుకోవట్లేదు" అని చెప్పారు. తానేం చేయాలో చెప్పాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ను ప్రశ్నించారు. ఆపై రాంగోపాల్ మాట్లాడుతూ, ఇది ఎంపీల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరినీ పీడిస్తున్న సమస్యని, దీన్ని ముందుగా మోదీ సర్కారు గుర్తించలేకపోయిందని ఆరోపించారు.