: కశ్మీర్ సమస్యను ట్రంప్ పరిష్కరిస్తారనే ఆశల్లో పాకిస్థాన్
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పై పాకిస్థాన్ చాలా ఆశలే పెట్టుకుంది. ట్రంప్ గెలవడంతో పాకిస్థాన్ లో సంబరాలు జరుపుకుంటున్నారు. దశాబ్దాలుగా నలుగుతున్న కశ్మీర్ సమస్యను ట్రంప్ పరిష్కరిస్తారని వారు ఎంతో ఆశగా ఉన్నారు. గత అక్టోబర్ లో ఓ మీడియా సంస్థతో ట్రంప్ మాట్లాడుతూ, తాను అధ్యక్షుడిగా గెలిస్తే... భారత్, పాక్ ల మధ్య నలుగుతున్న కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. ఈ విషయంలో పాక్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మాట్లాడుతూ, కశ్మీర్ విషయంలో ఐక్యరాజ్యసమితి కానీ, లేక ఎవరో ఒకరు జోక్యం చేసుకోవాలని పాక్ ఎప్పటి నుంచో కోరుతోందని అన్నారు. కశ్మీర్ అంశాన్ని ట్రంప్ పరిష్కరిస్తే... ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కాల్సిందే అని చెప్పారు. మరోవైపు, భారత్ ను ట్రంప్ దారిలోకి తెస్తాడని... పాక్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు ప్రసారమవుతున్నాయి. దీనికి తోడు, త్వరలోనే భారత్ లో పర్యటిస్తానని సర్తాజ్ అజీజ్ ప్రకటించారు. డిసెంబర్ 3న భారత్ లో జరగనున్న 'హార్ట్ ఆఫ్ ఏషియా' సదస్సుకు హజరవుతానని... తన పర్యటనతో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.