: అమరావతికి రైల్వే మణిహారం... విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలిని చుట్టేలా కొత్త రైల్వే లైన్
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రయాణికుల కష్టాలను తీర్చేలా సర్క్యులర్ రైలు మార్గం రానుంది. విజయవాడ నుంచి తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల మీదుగా గుంటూరు వెళ్లి, అటు నుంచి తెనాలి మీదుగా విజయవాడకు వచ్చేలా రైల్వే రౌండ్ లైన్ ను నిర్మించేందుకు ఢిల్లీలోని రైల్వే అధికారులతో అమరావతి మెట్రో రైలు ఎండీ రామకృష్ణా రెడ్డి చర్చలు జరిపారు. ఇప్పుడున్న రైలు మార్గాలు నిత్యమూ బిజీగా ఉండటం, ఈ మార్గాలపైనే సబర్బన్ రైళ్లు నడిపే వీలు తక్కువగా ఉండటంతో 110 కిలోమీటర్ల మేరకు కొత్త స్పీడ్ లైన్ ను నిర్మించాలన్న సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుత మార్గంలో రద్దీ ఎక్కువైనందున పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త మార్గం వేసేందుకు రైల్వే శాఖ కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన నిధుల కోసం ఫ్రాన్స్ కు చెందిన ఏఎఫ్డీతో సైతం రామకృష్ణా రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు.