: ఇండియాలో బ్లాక్ మనీ దందా నిర్వహించిన పాక్ నటులు ఫావాద్ ఖాన్, రహత్ ఫతే, అబ్బాస్ నక్వీ... 'న్యూస్ 18' స్టింగ్ ఆపరేషన్ సంచలనం


పాకిస్థాన్ నటులు ఫవాద్ ఖాన్, రహాత్ ఫతే అలీ ఖాన్, షఫాకత్ అమానత్ అలీ, మావ్రా హోకేన్, ఇమ్రాన్ అబ్బాస్ నక్వీ తదితరులు తమ ఏజంట్ల ద్వారా ఇండియాలో బ్లాక్ మనీ దందా నిర్వహించినట్టు హిందీ టీవీ చానల్ 'న్యూస్ 18' ఇండియా తన స్టింగ్ ఆపరేషన్ ద్వారా వెల్లడించింది. ఈ ఆపరేషన్ లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నవంబర్ 8న దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని ప్రకటించడానికి రోజుల ముందు ఈ స్టింగ్ ఆపరేషన్ సాగడం గమనార్హం. దాదాపు 15 రోజుల క్రితం న్యూఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో ఆపరేషన్ జరిగిందని న్యూస్ 18 ప్రకటించింది. అండర్ కవర్ రిపోర్టర్లు, పాక్ నటీనటుల ఏజంట్లను సంప్రదించి, వారిని పెళ్లిళ్లలో నృత్యాలు చేసేందుకు, సినిమాల్లో నటించేందుకు అడిగారు. అందుకు ప్రతిఫలంగా, తమ నటులకు ఆస్ట్రేలియా, దుబాయ్ తదితర దేశాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయాలంటూ ఏజంట్లు కోరారు. రెండు గంటల పాటు నృత్యం చేయడానికి ఫవాద్ రూ. 50 లక్షలు తీసుకుంటాడని అతని మేనేజర్ చెప్పాడు. ఈ డబ్బు, అటు బ్లాక్, ఇటు వైట్ రూపంలో ఉండాలని, కనీసం 25 శాతం మొత్తాన్ని యూఏఈలోని ఖాతాలో జమ చేయాలని కోరాడు. ఇక గాయకుడు షఫాకత్ అమానత్ విషయానికి వస్తే, ఆయన మేనేజర్ చెప్పిన ప్రకారం, రూ. 35 లక్షల నుంచి రూ. 65 లక్షలు ఆయన తీసుకుంటున్నాడు. రూ. 8 లక్షలు తీసుకుని ప్రదర్శనకు వస్తున్నట్టు అగ్రిమెంట్ రాస్తామని, రూ. 23 లక్షలు ఇవ్వాలని కోరాడు. ఇక ఇమ్రాన్ మేనేజర్ అయితే, ఏకంగా రూ. 35 లక్షలు అడుగుతూ, రూ. 32 లక్షలు లెక్కలోకి రాకుండా ఇవ్వాలని, కేవలం ఖర్చుల నిమిత్తం రూ. 3 లక్షలు వైట్ మనీ కావాలని అడిగాడు. ఇక ఇండియాకు వచ్చే పాక్ నటీనటులు, సెలబ్రిటీలంతా విదేశాంగ శాఖ నుంచి వర్క్ పర్మిట్ వీసాపై వచ్చేవారే. వారు చేస్తున్న ఈ దందా చట్టపరమైన నిబంధనలను తుంగలో తొక్కేదేనని, ఇకపై వారికి వీసాలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News