: మరో ఐదు రోజులు వరకు 500 నోట్లు వచ్చే అవకాశం లేదు: చంద్రబాబు
రాష్ట్ర ప్రజల నగదు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్బీఐ అధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా నగదు నిల్వలపై ఆయన ఆరాతీశారు. ఈ సందర్భంగా నోట్ల రద్దుతో ఏర్పడిన సమస్యలను అధికారులు ఏకరువుపెట్టారు. అంతే కాకుండా మరో ఐదురోజుల వరకు ఆర్బీఐ ముద్రిస్తున్న కొత్త 500 రూపాయల నోట్లు రాష్ట్రానికి చేరే అవకాశం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శిని ముంబై వెళ్లాలని సీఎం సూచించారు. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉన్న నగదు నిల్వలను ఇతర బ్యాంకులకు సర్దుబాటు చేయాలని ఆయన ఆదేశించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజలు ఎక్కువ సమయం వెచ్చించకుండా నగదు మార్పిడీకి డ్వాక్రా మహిళలను బిజినెస్ కరస్పాండెంట్లుగా నియమించే అంశాన్ని పరిశీలించాలని, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయన ఆర్బీఐ అధికారులు, బ్యాంకర్లను కోరారు.