: నడి రోడ్డుపై రిటైర్డ్ ఏఎస్సై దారుణ హత్య... అన్న కొడుకులే హంతకులు
సొంత అన్న కొడుకులే బాబాయ్ ని నడిరోడ్డుపై నరికి చంపిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... కృష్ణా జిల్లా నందిగామకు చెందిన గుంజి వెంకటేశ్వరరావు ఏఎస్సైగా పని చేసి పదవీ విరమణ చేశారు. ఇటీవలే ఆయన భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆయనకు అన్న కుమారులతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందాం రావాలని అతని అన్న కుమారులు ఆయనను పిలిచారు. వారి పిలుపు మేరకు వెళ్లిన ఆయనపై అన్న కుమారులు సత్యం, శివ, శ్రీను దాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని పారిపోతున్న ఆయనను వెంబడించిన వారు నడిరోడ్డుపై కత్తులతో పొడిచి పరారయ్యారు. కొనఊపిరితో ఉన్న ఆయనను స్థానికులు నందిగామ ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మరణించారు. పంచనామా నిర్వహించిన పోలీసులు, కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.