: ఆ వృద్ధుడి మరణం నన్ను చాలా బాధించింది: హీరో విజయ్
పెద్ద నోట్ల రద్దుపై ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్ స్పందించాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని చెప్పాడు. మన దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఈ నిర్ణయం మార్చి వేస్తుందని... ఇలాంటి నిర్ణయం చాలా అవసరమని, ఎంతో ధైర్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని కితాబిచ్చాడు. కానీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదని అన్నాడు. ఈ వ్యవహారంలో సాధారణ పౌరులే ఇబ్బందులు పడుతున్నారని చెప్పాడు. కేవలం 20 శాతం మంది కోసం 80 శాతం మంది ప్రజలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేక చాలా మంది బాధపడుతున్నారని అన్నాడు. డబ్బు మార్చుకోలేక తన మనవరాలి పెళ్లి జరగకపోవడంతో ఓ వృద్ధుడు మరణించిన ఘటన తనను ఎంతో బాధించిందని చెప్పాడు.