: ఆస్ట్రేలియాకు ఏమైంది? సొంతగడ్డపై వరుసగా రెండో ఘోర పరాజయం... సిరీస్ సౌతాఫ్రికా కైవసం
రెండు, మూడేళ్ల క్రితం వరకూ క్రికెట్లో అగ్ర జట్టుగా రాజ్యమేలిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు వరుసగా ఘోర ఓటముల పాలౌతోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ ను రెండు టెస్టుల తరువాత 2-0తో ఓడిపోయింది. హోబర్ట్ లో జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 85 పరుగులకు కుప్పకూలిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 60.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్ లో కట్టడి చేసిన సౌతాఫ్రికా, తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 326 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసీస్ ఆటగాళ్లు విఫలం కావడంతో దక్షిణాఫ్రికాకు ఇన్నింగ్స్ 80 పరుగుల తేడాతో భారీ విజయం, సిరీస్ దక్కాయి. 1912 తరువాత ఆస్ట్రేలియా జట్టులో నంబర్ 5 నుంచి 11 మధ్య ఆటగాళ్ల అత్యంత చెత్త ప్రదర్శన రెండో ఇన్నింగ్స్ లో నమోదు కావడం గమనార్హం. 2 వికెట్ల నష్టానికి 129 పరుగుల వద్ద ఉన్న ఆసీస్ స్కోరు, ఆపై 32 పరుగులు జోడించే లోపే 8 వికెట్లనూ కోల్పోయింది. ఈ ఓటమితో మిగిలివున్న మూడవ టెస్టు మ్యాచ్ ఫలితం నామమాత్రమే.