: నటి సబర్న మృతి కేసులో కీలక ఆధారాలు లభ్యం.. భర్తపైనే అనుమానం!
తమిళ సినీ, టీవీ నటి సబర్న అలియాస్ సుగుణ మృతి కేసులో పోలీసులు కీలక ఆధారాలు సంపాదించారు. సబర్న ఉత్తరాది సినీ రంగానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించిందని... ఏడాది క్రితం వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. గత రెండు నెలలుగా సబర్నను చూసేందుకు భర్త రాలేదని తెలిసింది. దీంతో, ఆమె భర్త కోసం పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. చెన్నైలోని మదరవాయిల్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఇటీవల సబర్న అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, డబ్బులు లేకపోవడంతో సబర్న ఇబ్బందులు పడింది. భర్తతో కేవలం ఫోన్ లోనే మాట్లాడుతూ ఉండేది. ఈ క్రమంలో, ఆమె చనిపోవడానికి ముందు రోజున ఆమె భర్త సబర్నను చూడ్డానికి వచ్చాడు. అతను తిరిగి వెళ్లిపోతున్న సమయంలో... తన వద్దే ఉండాలని ఆమె పట్టుబట్టింది. అంతేకాదు, కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ నేపథ్యంలో, సబర్నను హత్య చేసి, ఆధారాలను నాశనం చేసి, ఆమె భర్త పరారయ్యాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు, సబర్న చనిపోయిన తర్వాత అతను ఇంతవరకు చూడ్డానికి కూడా రాలేదు. దీంతో, అతనిపై పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి.