: పాత ట్రంప్ లా ఉండొద్దు.. టెంపర్ తగ్గించుకో: ఒబామా సలహా
అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్ మునుపటిలాగా వ్యవహరిస్తే బాగుండదని ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ట్రంప్ చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వుంటుందని, ప్రచారం చేసుకుంటున్న సమయంలో మాట్లాడినట్టు ఇకపై మాట్లాడరాదని సూచించారు. వైట్ హౌస్ వద్ద పత్రికా మండలి సదస్సు జరుగగా, అందులో ప్రసంగించిన ఒబామా పలు సలహాలు ఇచ్చారు. ట్రంప్ తన టెంపర్ ను తగ్గించుకోవాలని అన్నారు. వివిధ దేశాల నుంచి సమయం, సందర్భం లేకుండా ఫోన్లు వస్తాయని, దేశాధ్యక్షులు మాట్లాడతారని, అటువంటి ఫోన్ కాల్స్ కు ఓపికగా బదులివ్వాలని అన్నారు. కలిసేందుకు వచ్చే వారితో సహనంగా ఉండాలని, ప్రపంచమంతా తననే చూస్తుందని గుర్తెరగాలని సూచించారు. ఇక ట్రంప్ నియామకాల గురించి తాను స్పందించబోనని, అది ఆయన వ్యక్తిగతమని అన్నారు.