: వివాదాస్పదమైన పేటీయం యాడ్.. క్షమాపణలు చెప్పిన సంస్థ
భారతదేశంలో అతిపెద్ద మొబైల్ పేమెంట్ కంపెనీ అయిన పేటీయం కొత్త యాడ్ వివాదాస్పదమయింది. నల్లధనాన్ని అరికట్టే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఈ యాడ్ ను పేటీయం రూపొందించింది. 'డ్రామా బంద్ కరో... పేటీయం కరో' అనే ట్యాగ్ లైన్ తో ఈ యాడ్ ఉండటం పట్ల పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అనేక మంది సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్య పరిస్థితులను కించపరిచేలా యాడ్ ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. కొంత మంది అయితే ఈ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేస్తామంటూ ట్వీట్ చేశారు. నోట్ల సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే... ఈ విధంగా అవమానపరుస్తారా? అంటూ ప్రశ్నించారు. ప్రజల కష్టాలు మీకు డ్రామాగా ఉన్నాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పేటీయం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ స్పందిస్తూ, ప్రజలకు క్షమాపణలు చెప్పారు. యాడ్ ను అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. ప్రజలను కించపరిచే పనులను పేటీయం చేయదని చెప్పారు. మరోవైపు, పేటీయం లావాదేవీలు భారీ ఎత్తున పెరిగాయి. గతంలో రోజుకు 25 నుంచి 30 లక్షల వరకు ఉన్న లావాదేవీలు... నోట్ల రద్దు తర్వాత ఏకంగా 50 లక్షలకు చేరాయి.